పలాసలో ప్రశాంత ఎన్నికలే లక్ష్యం తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలపై కఠిన చర్యలు: గౌతు శిరీష

0
2

పలాస: పలాస నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డులలో కూటమి ప్రభుత్వం (జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ) అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి ఒక మహిళగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, మున్సిపాలిటీ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదే విధంగా సోషల్ మీడియా వేదికలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం, అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆమె అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, సోషల్ మీడియా నిర్వాహకులు సహకరించాలని గౌతు శిరీష కోరారు. ప్రజలు కూడా అపోహలను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.