పలాస: పలాస మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా తన సతీమణి మన్యాల రమ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని మన్యాల శ్రీనివాస్ యాదవ్ పలాస ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రమ్యతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన, విలువలతో కూడిన రాజకీయాల కోసం తమను ఆశీర్వదించాలని కోరారు.
కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న తీరు, పార్టీకి అందించిన సేవలు అందరికీ తెలిసినవేనని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గంలో టీడీపీని గెలిపించాలనే లక్ష్యంతో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించానన్నారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, దాడులు, పోలీసు కేసులను ఎదుర్కొన్నా వెనుకంజ వేయలేదని గుర్తుచేశారు.
స్వర్గీయ ఎర్రంనాయుడు ఆశయ సాధన కోసం కృషి చేశానని, గౌతు శ్యామసుందర్ శివాజీ విలువలతో కూడిన రాజకీయాలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. పదవులు, డబ్బు ఆశించకపోయినా కనీస మర్యాద, గుర్తింపు దక్కలేదని, తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గం, పలాస మున్సిపాలిటీ ప్రజలను తన కుటుంబంగా భావించి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. రిజర్వేషన్ మహిళకు కేటాయించడంతో తన భార్య రమ్యను ప్రజల ముందుకు తీసుకొచ్చానని, ఆమెను ఆశీర్వదించాలని కోరారు.
“భగవంతుడి దయవల్ల నేను సంపాదించుకున్నది నాకు సరిపోతుంది. దాని నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను” అని ఆయన అన్నారు. ప్రజలను నమ్ముకుని ముందుకు వస్తున్నానని, సంవత్సరంలో 365 రోజులూ, 24 గంటలూ ప్రజలతోనే ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలకు కష్టం వస్తే తన ఆస్తులు అమ్మి అయినా సేవ చేస్తానని స్పష్టం చేశారు.
రమ్యను భారీ మెజారిటీతో గెలిపిస్తే పలాస మున్సిపాలిటీని అభివృద్ధి చేసి, చక్కటి రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణ పూర్తి వివరాలను అతి కొద్ది రోజుల్లోనే పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని చెప్పారు.










