పలాస/కాశీబుగ్గ: పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కొన్ని కేంద్రాల్లో మిగిలి ఉన్న క్యూలైన్లు మరో గంటలో పూర్తవుతాయని, అనంతరం పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ సెంటర్కు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తామని ఎస్పీ వివరించారు.
ఎల్లుండి జరిగే ఓట్ల లెక్కింపు కోసం కాశీబుగ్గలోని పాఠశాల వద్ద, ఇచ్ఛాపురంలోని మోడల్ స్కూల్ వద్ద కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రెండు చోట్లా నిబంధనల ప్రకారం తగినంత పోలీసు బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి అభ్యర్థులను, ముందుగా వివరాలు సమర్పించిన ఆథరైజ్డ్ కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
పోలింగ్ రోజు మాదిరిగానే కౌంటింగ్ రోజున కూడా 163 BNSS (పాత 144 సెక్షన్), పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయని ఎస్పీ చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమల్లో ఉన్నందున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకూ అనుమతి లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే అభ్యర్థులకు తెలియజేశామని పేర్కొన్నారు. పోలింగ్ లాగే కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసేలా అందరూ సహకరించాలని ఆయన కోరారు.










