మంచిర్యాల: ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో కలిసి సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, ప్రతి రైతు సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరయ్యేలా టామ్ టామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. భూముల రీ సర్వే ప్రక్రియను ఖచ్చితత్వంతో నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు, సమస్యలు తలెత్తకుండా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు మొత్తం 12 జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను సర్వేయర్లకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ పరికరాల ద్వారా భూముల కొలతలను మరింత ఖచ్చితంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు.










