హైదరాబాద్: సింగరేణి బొగ్గు గని కార్మికుల మారుపేర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు మరోసారి ఆశలు చిగురించాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అక్టోబర్ 13న సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలతో పాటు మారుపేర్ల సమస్యను కూడా 15 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సుమారు 136కు పైగా పెండింగ్లో ఉన్న పేర్ల మార్పు అభ్యర్థనలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అయితే 15 రోజుల గడువు ముగిసినప్పటికీ మారుపేర్ల బాధితుల సమస్యకు సంబంధించిన తుది ఉత్తర్వులు, అమలు ప్రక్రియపై స్పష్టమైన సమాచారం ఇంకా వెలుగులోకి రాలేదు.ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుంది? అధికారుల కమిటీ చేసిన సిఫార్సులకు ఎప్పుడు ఆమోదం లభిస్తుంది? సింగరేణి యాజమాన్యం ఎప్పుడు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తుంది? అనే ప్రశ్నలు బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇక ప్రకటనలు కాకుండా ఆచరణలో పరిష్కారం కావాలని వారు కోరుకుంటున్నారు.భట్టి విక్రమార్క ఇచ్చిన 15 రోజుల హామీని తక్షణమే అమలు చేసి, అర్హులైన బాధితులకు న్యాయం చేయాలని, అధికారుల కమిటీ నివేదికను బహిర్గతం చేసి, మారుపేర్ల సమస్య పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి, సింగరేణి మారుపేర్ల బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే రోజు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.










