రెండు మూడు రోజుల్లో పైపులైన్ పనులు పునఃప్రారంభం – అప్పటివరకు ట్యాంకర్లతో నీటి సరఫరా
పలాస-కాశీబుగ్గ, నవంబర్ 14: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 11వ వార్డు పద్మనాభపురం కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు.
నూతన మున్సిపల్ చైర్మన్ వజ్జ గంగాభవాని, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, కౌన్సిలర్ సార రోజాతో కలిసి కాలనీలో పర్యటించారు. కాలనీలో తిరుగుతూ తాగునీటి సరఫరాకు సంబంధించిన ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం చైర్మన్ గంగాభవాని మాట్లాడుతూ, నిలిచిపోయిన పైపులైన్ పనులను రెండు మూడు రోజుల్లో పునఃప్రారంభిస్తామని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి, కాలనీకి శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
పైపులైన్ పనులు పూర్తయ్యే వరకు కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా స్పందించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









