ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుల పేరుతో మోసాలు చేస్తూ ప్రజలను మోసం చేసిన సైబర్ ముఠాను CID అరెస్ట్ చేసింది.
నారా లోకేష్ ఫోటోను WhatsApp డీపీగా పెట్టి, “TDP NRI Convener”గా నటించిన ప్రధాన నిందితుడు కొండూరి రాజేష్, గుట్టికొండ సాయి శ్రీనాథ్, చిత్తాడి తల సుమంత్‌లను CID అదుపులోకి తీసుకుంది.
#help_@naralokesh, #help_@pawankalyan, #help_@ncbn వంటి హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా సోషల్ మీడియాలో వైద్య, ఆర్థిక సహాయం కోరుతున్న బాధితులను గుర్తించి, US ఆధారిత నంబర్ల ద్వారా సంప్రదించారు. బ్యాంక్, వైద్య వివరాలు సేకరించి, ₹10 లక్షల ఫండ్ ట్రాన్స్‌ఫర్ అయిందని నకిలీ రసీదులు పంపించి, “రిమిటెన్స్ ఛార్జీలు” పేరిట డబ్బులు వసూలు చేశారు.
ఈ మోసం విజయవాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. CID అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ నాయకుల పేరుతో వచ్చే సందేశాలను ధృవీకరించకుండా డబ్బులు పంపవద్దని హెచ్చరిస్తున్నారు.



