ఆదివారం రాత్రి 9.40-9.50 సమయం.
నగరంలో అన్ని రోడ్ల మీద భవానీలు కాలి నడకన ఇంద్రకీలాద్రి వైపు వెళుతున్నారు. లో బ్రిడ్జి, కంట్రోల్ రూమ్ ఫ్లై ఓవర్ మీదుగా పాతబస్తీలోకి రాకపోకలు నిలిచిపోయాయి.
పాతబస్తీలోకి వెళ్ళే వాహనాలు అన్నీ రైల్వేస్టేషన్ వైపుగా ఎర్రకట్ట వైపు వచ్చాయి.
కొన్ని వాహనాలు ఖుద్దుస్ నగర్ నుంచి ఎర్రకట్ట వైపు వచ్చాయి. BRTS రోడ్డు, ప్రభాస్ కాలేజ్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఎర్రకట్ట ప్రారంభంలో పోగు అయ్యాయి.
భవానీ దీక్షల విరమణ కోసం గిరి ప్రదక్షణ జరుగుతూ ఉండటంతో పాతబస్తీ వైపు వాహనాలు నియంత్రిస్తున్నారు.
ఈ క్రమంలో ఎర్రకట్ట దగ్గర వందల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మరో మార్గంలో వెళ్ళాలి అని పోలీసులు అడ్డుకోవడంతో ఎటు వెళ్లాలో తెలియక అరగంట పాటు వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
నగరంలోని మిగిలిన ప్రాంతాల నుంచి పాతబస్తీలోకి కనెక్టివిటీ మార్గాలు అన్నీ మూసి వేయడంతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే చలి గాలిలో పిల్లలతో బళ్ల మీద ఉన్న వారు ఉన్నారు.
ట్రాఫిక్ పోలీసులు ససేమిరా అనడంతో ఒక్కసారిగా హార్న్ మోగిస్తూ జనం నిరసనకు దిగారు. దాదాపు ఐదు నిమిషాల పాటు వాహనాలు అన్నీ హారన్ మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
జనంలో ఆగ్రహాన్ని చూసిన ట్రాఫిక్ పోలీస్ SI పై అధికారులకు పరిస్థితి వివరించడంతో వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు.
ఈ ఘటన నగరంలో పాతబస్తీ ప్రాంతానికి ప్రత్యామ్నాయ కనెక్టివిటీ అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద ఫ్లై ఓవర్ ప్రతిపాదన 25ఏళ్లుగా ముందుకు కదలడం లేదు. ఎర్రకట్ట విస్తరణ జరగడం లేదు.