Home South Zone Andhra Pradesh 2027లోపు బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి చేయాలి |

2027లోపు బెంగళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి చేయాలి |

0

ప్రధాన ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచన
రాష్ట్రంలో గుంతల్లేని రోడ్ల కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి
రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూ.42,194 కోట్ల విలువైన పనులను వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రహదారుల ప్రాజెక్టులు చేపట్టాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ శాఖల ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

శ్రీకాకుళంలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సీఎం సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ పోర్టులకు సరుకు రవాణా జరిగేలా రోడ్లను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. ఖరగ్‌పూర్-అమరావతి, నాగ్‌పూర్-విజయవాడ, రాయ్‌పూర్-అమరావతి వంటి కీలకమైన కారిడార్ల డీపీఆర్‌లను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ల రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, వేస్ట్ ప్లాస్టిక్, నానో కాంక్రీట్ వంటి ఆధునిక టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version