చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయం
అందుకే ఫ్లెక్సీలపై ఇప్పుడు అనవసర రాద్ధాంతం
::మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం
అనంతపురంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్.
వైయస్సార్‌సీపీ ఏ హింసనూ ప్రోత్సహించదు
నిజానికి ఆ పని చేస్తోంది తెలుగుదేశం పార్టీనే
:మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్సష్టీకరణ
ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు బలి ఇస్తే కేసు పెడతారా?
ఆ యువకులను నడిరోడ్డుపై నడిపిస్తారా?
వారే నేరం చేశారని అంత దారుణ వ్యవహారం?
గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద ఏం చేశారు?
అవేవీ సీఎంకు, హోం మంత్రికి కనిపించడం లేదా?
నాడు పొట్టేళ్లు బలి ఇచ్చి, ఫ్లెక్సీలపై రక్త తర్పణం చేయలేదా?
మరి వారిపైనా పోలీసులు కేసు పెట్టి నడిపిస్తారా?
:ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన సాకే శైలజానాథ్
అనంతపురం:
సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని, అందులో భాగంగానే ఇప్పుడు ఫ్లెక్సీలు, జంతు బలులు అంటూ అనవసర రాద్దాంతం చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ నేత సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. వైయస్సార్‌సీపీ ఏ హింసనూ ఏనాడూ ప్రోత్సహించలేదన్న ఆయన, నిజానికి ఆ పని తెలుగుదేశం పార్టీ చేస్తోందని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు బలి ఇచ్చారని, యువకులపై కేసు పెట్టిన పోలీసులు, వారిని హింసించి, ఆ తర్వాత నడిరోడ్డుపై నడిపించారని దుయ్యబట్టారు. ఆ స్థాయిలో యువకులను హింసించేంత నేరం వారేం చేశారని నిలదీశారు.
గతంలో చంద్రబాబు, ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాగే పొట్టేళ్ల తల కొట్టి, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని సాకే శైలజానాథ్ గుర్తు చేశారు. అవేవీ చంద్రబాబుకు, హోం మంత్రికి కనిపించడం లేదా? అన్న ఆయన, మరి ఆ పని చేసిన టీడీపీ కార్యకర్తలపైనా ఇప్పుడు కేసులు పెడతారా అని, అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ ప్రశ్నించారు.
ప్రెస్‌మీట్‌లో సాకే శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
మరి వాటి సంగతేమిటి బాబూ?:
జగన్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఒకటి, రెండు చోట్ల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు కొడితే, అది పెద్ద నేరం అన్నట్లు.. రాష్ట్రంలో గతంలో ఎక్కడా అలా జంతుబలి జరగనట్లు మీరు (సీఎం చంద్రబాబు), మీ హోం మంత్రి మాట్లాడుతున్నారు. దాని వల్ల సమాజం నాశనమై పోతున్నట్లు నిందిస్తున్నారు. యువతను ప్రభావితం చేస్తున్నట్లు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అలా చేసి హింసను ప్రేరేపిస్తున్నారు కాబట్టి, రాష్ట్ర బహిష్కరణ చేస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు.
మరి జాతరలు, గ్రామోత్సవాల్లో కూడా జంతుబలులు సహజం. వాటిని కూడా తప్పు పడుతున్నారా? మొక్కుల కోసం జంతుబలి ఇచ్చిన వారిపైనా చర్యల తీసుకుంటారా? లేదా రాష్ట్రంలో జంతుబలులనే నిషేధిస్తారా?.
జగన్‌గారి ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్ల బలిని అంతగా తప్పు పడుతున్న మీకు.. హిందూపురంలో మీ బావమరిది నందమూరి బాలకృష్ణ గెలుపు తర్వాత పదుల సంఖ్యలో పొట్టేళ్లు నరికి, వాటి తలకాయలతో ఆయన ఫ్లెక్సీకి దండ వేశారు. అది కనిపించడం లేదా బాబుగారూ?. ఇంకా 2023లో మీ (చంద్రబాబు) పుట్టినరోజు సందర్భంగా మీ పార్టీ కార్యకర్తలు పొట్టేళ్లు నరికి, రక్తంతో మీ ఫ్లెక్సీకి రక్త తర్పణం చేశారు. అంతెందుకు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, అనేకచోట్ల మీ ఫ్లెక్సీలు పెట్టి, బహిరంగంగా పొట్టేళ్లు నరికి, ఆ రక్తాన్ని మీ ఫ్లెక్సీలకు తర్పణం చేశారు. అవన్నీ నిజం కాదా? మరి వాటికేం సమాధానం చెబుతారు?.
కదిరి దగ్గర జనసేన కార్యకర్త ఇంట్లో చిన్న గలాటా జరిగితే, దాన్ని కూడా వైయస్సార్‌సీపీకి అంటగట్టి బురదచల్లే ప్రయత్నం చేశారు. చివరకు ఆ యువకుడి సోదరి, పూర్తి వివరాలు స్వయంగా చెప్పింది.
మెడికల్ కాలేజీలు, శాంతిభద్రతల వైఫల్యం కప్పిపుచ్చేందుకే..:
రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. శాంతిభద్రతలు ఛిద్రమవుతుంటే.. గంజాయి బ్యాచ్‌లు పెరుగుతూ పదులు, వందల కేజీల్లో గంజాయి దొరుకుంటే.. మీ నేతలు తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటుంటే.. సగటు మనుషులు బిక్కుబిక్కుమంటూ పోలీసు స్టేషన్లకు వెళ్తుంటే.. ఎమ్మెల్యేలు చెప్పాలని వారు తిప్పి పంపిస్తుంటే ఇవన్నీ మీకు కనిపించడం లేదా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతిభద్రతలపై మీకు లేఖ రాయలేదా? శాంతిభద్రతలే కాదు, ఏమీ లేదు ఇక్కడ.
రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉద్యోగాలు లేవు. పెట్టుబడులు లేవు. ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్లా మీ పార్టీ దుర్మార్గమైన ఆలోచనలతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పి పుచ్చేందుకు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
ఇంకా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిర్ణయిస్తే, మీరు చేస్తున్న అవినీతి, అక్రమ వ్యవహారం అర్థమై, ఎవరూ బిడ్ వేయలేదు. అందుకే ఒక్కటంటే ఒక్కటీ సరైన బిడ్ రాలేదు. జగన్మోహన్‌రెడ్డిపై నమ్మకంతోనే మెడికల్ కాలేజీల బిడ్లు వేయడానికి ఎవరూ రాలేదు. వీటన్నింటి నుంచి డైవర్షన్ కోసం, ఇప్పుడు ఫ్లెక్సీలు, రక్తతర్పణాలు అంటూ అనవసర రచ్చ చేస్తున్నారు.
పోలీసులూ అది గుర్తు చేసుకొండి:
పోలీసు అధికారులకు కూడా చెబుతున్నాం. మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడం తగదు. టీడీపీ ప్రభుత్వంపై ప్రమాణం చేసి మీరు ఉద్యోగాల్లోకి రాలేదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు.
అనంతపురంలో రోడ్డు వేస్తుంటే టీడీపీ దిమ్మె కూలగొట్టారు. ఇక్కడ కాంట్రాక్టర్ మీ వాడు. అధికారులు మీ చెప్పుచేతల్లో ఉన్న వాళ్లు. జేసీబీ డ్రైవర్ కూడా మీవాడే. కానీ జనం మీద బలం చూపిస్తామంటే కుదరదు. పోలీసు శాఖ ఉన్నది న్యాయాన్ని రక్షించడం కోసం. ప్రజలకు రక్షణ కల్పించడం కోసం. అంతేకానీ, అధికార పార్టీ వారు చెప్పిందే చేయడం కోసం కాదని సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.
