కర్నూలు : కర్నూలు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 47.90 శాతం ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా 14వ స్థానంలో నిలిచిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జనవరి చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను సరిగా చేపట్టని ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేశామన్నారు.
మున్ముందు బీఎల్వోలు నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏ) వెంటనే నియమించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం గోదామును శనివారం త్రైమాసిక తనిఖీ చేపట్టారు. పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని
అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితాలో రూపకల్పన బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు.
