Home South Zone Andhra Pradesh అయోధ్యపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు |

అయోధ్యపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు |

0

సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్*

*దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అయోధ్య*

*అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

*అయోధ్య, డిసెంబర్ 28 :-* సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి పరిపాలనను రామరాజ్యంతోనే పోల్చుకుంటామని అన్నారు. ఆదివారం అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కొలమానంగా తీసుకుంటామని అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామమందిరం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ ప్రజల కల సాకారమైందన్నారు. భారత్‌లో ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామాలయం మారిందని అన్నారు. ఆలయ నిర్మాణంతో పాటు యూపీలో సుపరిపాలన అందిస్తున్న యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.

దేశంలోని ఇతర దేవాలయాలకు అయోధ్య రామాలయం మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సాంకేతికంగా ముందుడుగు వేస్తున్న భారత్‌ను ఎవరూ నిలువరించలేరని స్పష్టం చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో యూపీ, బీహార్‌లు కూడా కీలక పాత్ర పోషించాలని అన్నారు. శ్రీ రాముడి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. ‘శ్రీ రాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి. రాముడు పాటించిన విలువలు సుపరిపాలనకు నిరంతరం మార్గదర్శంగా నిలుస్తాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు నూతన శక్తిని ఇచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version