గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధియే తన ఏకైక లక్ష్యమని, గ్రామాల్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పర్యటించిన ఆయన.
‘పల్లె పండుగ 2.0’లో భాగంగా రూ. 2 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం కోటగట్టు సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ బస్సు షెల్టర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ నున్న వెస్ట్ బైపాస్ అండర్‌పాస్ నుండి నున్న సెంటర్ వరకు రోడ్డు కుచించుకుపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని.
దీని పరిష్కారానికి రూ. 9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రూ. 4.30 కోట్ల నిధుల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు వెల్లడించారు.
రోడ్డు ఆక్రమణల తొలగింపు సమయంలో వ్యాపారులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, తాను వ్యాపారులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే 9 గ్రామాలపై నిర్లక్ష్యం తగదని అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మాదిరిగానే ఎన్టీఆర్ జిల్లా నుండి కూడా సమానంగా నిధులు రావాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం కుదేలైందని, తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని విమర్శించారు. అయితే, ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై పడకూడదనే ఉద్దేశంతో రూ. 4,498 కోట్లను కూటమి ప్రభుత్వమే భరిస్తుందని యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. దావోజిగూడెం రోడ్డు విస్తరణతో పాటు గన్నవరం పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాల ఆధునికీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లోని సమస్యలపై ఆయా గ్రామాల ప్రజలు సమావేశాలు నిర్వహించి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన కార్యాలయంలో సంప్రదిస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో విజయవాడ రూరల్ మండల ఎంపీడీఓ విగిన్స్, టిడిపి మండల అధ్యక్షులు గొడ్డళ్ల చిన రామారావు.
మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు, నున్న గ్రామ టిడిపి అధ్యక్షులు కలతోటి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు మాదు శివరాంప్రసాద్, గండికోట సీతయ్య, బొకినాల తిరుపతిరావు, గంపా శ్రీనివాస్, గుంటక సుబ్బారెడ్డి, పట్టపు చంటి, బేతపూడి ముత్తయ్య, అంగజాల లక్ష్మీ నారాయణ, గుండాల వెంకటేష్, మేక నాగబాబు, మిరంపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
