నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం”
– ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ వెల్లడి.
ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించి ప్రచురిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించారు.
విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక ప్రదర్శన మహోత్సవంలో ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ స్టాల్ వద్ద సోమవారం రాత్రి జరిగిన పుస్తకావిష్కరణ సభలో శ్రీ షుబ్లీ మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు.
శ్రీ సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన నూతన గ్రంథం “అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా” ను కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రోద్యమం లో ముస్లింల పాత్రను వివరిస్తూ సయ్యద్ నశీర్ అహమ్మద్ వెలువరించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువాదం చేస్తామని, ఆ గ్రంథాలను ముద్రించి మన రాష్ట్రం, మన దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్రంథాలయాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పార్టీ రాజకీయ కార్యదర్శి శ్రీ టీడీ జనార్ధన్ , సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ , సిపిఐ (ఏం) జాతీయ పాలిటి బ్యూరో సభ్యులు శ్రీ బివి రాఘవులు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ గొల్ల నారాయణరావు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిల్లి సురేంద్రబాబు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
