Home South Zone Andhra Pradesh శక్తి బృందాలతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు

శక్తి బృందాలతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు

0

మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు*

*పోలీస్ అధికారులు, శక్తి బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ గారు*

మహిళలు, చిన్నారుల రక్షణ మరియు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒంగోలు, దర్శి, కందుకూరు, కనిగిరి మరియు మార్కాపురం సబ్‌డివిజన్‌ల డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శక్తి బృందాల విధులు, శక్తి యాప్ డౌన్‌లోడ్ ప్రక్రియ, మహిళల భద్రత, గంజాయి మరియు మాదకద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు గ్రామ మరియు వార్డు పరిధిలోని బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద నిరంతరం పర్యటిస్తూ మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యత, అందులో లభించే సేవలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

విద్యార్థులు, మహిళలు మరియు ప్రజలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించి, వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ ఇన్‌స్టాల్ చేయించి, పోలీస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. మహిళలపై వేధింపులు జరిగే ప్రాంతాలు, ఆకతాయిల సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మహిళలు, బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారికి భద్రతతో కూడిన స్వేచ్ఛను కల్పించడమే శక్తి బృందాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడమే కాకుండా, మహిళలకు భద్రతా సూచనలు ఇవ్వడం, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి సంబంధించిన చట్టాలు, శిక్షలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోక్సో కేసులకు సంబంధించిన బాధితుల ఇళ్లను సందర్శించి, వారికి ధైర్యం, నమ్మకం, భరోసా కల్పించే విధంగా విధులు నిర్వహించాలన్నారు. శక్తి టీములు, మహిళా పోలీస్‌లు, డ్వాక్రా మహిళలు సమన్వయంతో మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు, రక్షణ చట్టాలు, శక్తి యాప్ గురించి వివరించాలని, శక్తి టీమ్ సభ్యులు, గ్రామ పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు స్వీయ రక్షణ (Self-Defence), గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, శక్తి వారియర్స్ ద్వారా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శక్తి కాల్స్, డయల్ 100/112, ఉమెన్ హెల్ప్‌లైన్–181 ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులు చురుకుగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version