Home South Zone Andhra Pradesh పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.

పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.

0

డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష
2026ను ‘టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్’గా మార్చాలని పిలుపు
ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ వినియోగం పెంచాలని సీఎం ఆదేశం
‘మన మిత్ర’ ద్వారా ఇప్పటివరకు 1.43 కోట్ల మందికి సేవలు

పాలనలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. డేటా ఆధారిత పాలనపై మరింత దృష్టి సారిస్తామని, 2026వ సంవత్సరాన్ని ‘టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్’గా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… సామర్థ్యం లేని ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే అనేక సమస్యలను టెక్నాలజీతో సులభంగా పరిష్కరించవచ్చని అన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) ఏఐ ద్వారా వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

‘మన మిత్ర’ – వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై కూడా సీఎం సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

NO COMMENTS

Exit mobile version