Telangana Andhra Pradesh CMs express shock over Ajit Pawars demise
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ప్రజా జీవితానికి ఇది తీరని లోటని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి
పవార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్, జగన్, కేటీఆర్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు అజిత్ పవార్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఈ ఉదయం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకాల మరణం వార్త విని తీవ్రంగా కలత చెందాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా, అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవార్ మరణం ప్రజా జీవితానికి తీరని లోటని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేత అయిన పవార్ ప్రజాసేవ చిరస్మరణీయమని పవన్ కొనియాడారు. క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలున్న అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయామని, మహారాష్ట్ర రాజకీయాలకు ఇది తీరని లోటని కేటీఆర్ అన్నారు.
