మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.
వీకెండ్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 321 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు.
పట్టుబడిన వారిలో అత్యధికంగా 249 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 59 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, 11 మంది ఆటో డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహన చోదకులు ఉన్నారు. వీరి రక్తంలోని ఆల్కహాల్ శాతం (BAC) ఆధారంగా పోలీసులు కేసులను వర్గీకరించారు. ఇందులో 11 మందికి 300 mg కంటే ఎక్కువ ఆల్కహాల్ శాతం నమోదవ్వడం గమనార్హం. పట్టుబడిన వారందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మల్కాజిగిరి డీసీపీ స్పష్టం చేశారు. తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణమైతే, వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద ‘హత్య కానే నేరపూరిత నరహత్య’ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
గత వారం (మార్చి 1 నుంచి మార్చి 7 వరకు) నమోదైన కేసుల్లో 228 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వారిలో ఐదుగురికి జైలు శిక్షతో పాటు జరిమానా, 10 మందికి సామాజిక సేవ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన 213 మందికి భారీగా జరిమానా విధించింది. రహదారి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.
#sidhumaroju
Alwal
