సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ పగ తీర్చుకున్నారంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో చేపట్టిన కూల్చివేతల్లో భాగంగా ముఖీం అనే న్యాయవాదికి చెందిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ము ఖీం ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది.
నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారంటూ రంగనాథ్‌ను ముఖీం నిలదీశారని, దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ముఖీంకు చెందిన నిర్మాణాలను కూల్చివేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖీం తండ్రి నిజాం పాలకుల దగ్గర దివాన్‌గా ఉన్న ఓ వ్యక్తి దగ్గర పనిచేసేవాడని, ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముఖీం తండ్రికి 19 ఎకరాలు సమకూరిందని స్థానికులు చెప్తున్నారని హైడ్రా జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ముఖీం ఈ 19 ఎకరాలతోపాటు మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్‌హౌస్ నిర్మించినట్టు అక్కడ లేఔట్ యజమానులు చెప్తున్నారని హైడ్రా తెలిపింది. ఈ నేపథ్యంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతల తర్వాత ముఖీంను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ప్రకటనలు, ఆయననే టార్గెట్‌గా చేసుకొని కమిషనర్ చేసిన వ్యాఖ్యలతో ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యగా ఉన్నదని స్థానికులు చర్చించుకుంటున్నారు.









