చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. రూ.3.17 కోట్ల వ్యయంతో జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లతో కలిసి మంత్రి బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. అనంతరం చిన్నారులతో టేబుల్ టెన్నీస్, హాకీ ఆడి వారిని ఉత్సాహపరిచారు. 2017లో మంజూరైన ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోగా, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఇండోర్ గేమ్స్‌తో పాటు వాలీబాల్, కబడ్డీ, హాకీ వంటి అవుట్ డోర్ క్రీడా సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.










