చింతూరు మండలంలో ‘వెలుగు‘ (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు మహిళా సంఘాలు గళమెత్తాయి. సుమారు 1.30 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని, తక్షణమే ఆ సొమ్మును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ గారికి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పోలవరం జిల్లా గిరిజన సంఘం నాయకులు సురేష్ మాట్లాడుతూ. 2017 నుండి 2020 మధ్యకాలంలో మండలంలోని 458 మంది సభ్యుల పేరు మీద వారు అప్పు తీసుకోకపోయినా, తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారు.
లాగిన్ లో విరిపెర్లమీద అప్పు ఉన్నట్లు చూపిస్తుంది అప్పటి సీసీ, ఏపిఎం, ఏపీడి లు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తుంది.రికార్డుల్లో అప్పులు ఉన్నట్లు చూపిస్తుండటంతో, గత 10 ఏళ్లుగా ఈ పేద మహిళలకు కొత్త అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు కట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు.ఈ సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ , బాధితులతో మాట్లాడి 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.








