వేటపాలెం
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని కేబి పార్క్‌ను ఆదారంగా చేసుకుని కుందేరు ప్రాంతంలో భూ అక్రమాలు జరుగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, గతంలో కొంతమంది వ్యక్తులు కుందేరు ప్రవాహాన్ని పూడ్చి కేబి పార్క్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని ప్రస్తుతం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుందేరు పరిధిలోని భూములను ఆక్రమించి, వెంచర్ల రూపంలో విభజించి అమ్మకాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
ఇంకా, ఈ భూములపై సరైన హక్కులు లేకుండానే నకిలీ పట్టాలు సృష్టించి, ఫ్లాట్లుగా మార్చి ప్రజలకు విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో కొనుగోలు దారులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఇలాంటి అక్రమాలకు పంచాయతీ అధికారులు ఎలాంటి అనుమతులు ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని చీరాల ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిజానిజాలు బయటపెట్టి, అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.










