విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల నుండి కేటాయించిన రూ. 75 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేదలు మరియు క్రైస్తవ సోదరుల సామాజిక అవసరాల కోసం ఈ ‘క్రిస్టైన్ కన్వెన్షన్ సెంటర్’ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. శుభకార్యాలు, ప్రార్థనలు అతి తక్కువ ఖర్చుతో నిర్వహించుకునేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిధుల కొరత లేకుండా ప్రతి గడపకూ అభివృద్ధి ఫలాలు అందిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










