మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖర్గే వెంటనే తన నాలుకను అదుపులో పెట్టుకోవాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం దేశ రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.
దేశంలో అన్ని రాజ్యాంగ రక్షణలు అనుభవిస్తూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి పదవి కేవలం ఒక వ్యక్తిది కాదని, అది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఒక గొప్ప వ్యవస్థ అని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.
ఖర్గే చేసిన ఈ ప్రకటన ప్రజాస్వామ్య విలువలకు తలవంపులు తెచ్చేలా ఉందని, ఇది విమర్శ కాదని, అత్యున్నత పదవిని దూషించడమేనని ఆయన విమర్శించారు.
భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఖర్గేపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే పోలీసు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో విభేదాలు సహజమని, అయితే ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం అన్ని హద్దులు దాటడమేనని శ్రీనివాస్ వర్మ అన్నారు.
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు హుందాతనంతో వ్యవహరించాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఖర్గే వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
#sidhumaroju
Alwal










