భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!

0
5

హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విస్తరణ నిర్ణయం తీసుకుందని హైడ్రా కమీషనర్ పేర్కొన్నారు.హైడ్రా తన కార్యకలాపాలతో ఇప్పటివరకు సుమారు రూ.85,000 కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు ఆయన ప్రకటించారు. మరో సంవత్సరంలోగా రూ.1లక్ష కోట్లు విలువైన భూములను రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

‎హైడ్రా పరిధిలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఉందని కమిషనర్ వెల్లడించారు. భూ కబ్జాలకు సంబంధించి హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ అంకితభావంతో, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా హైడ్రా ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.