మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సామాజిక సేవకు దక్కిన గౌరవం… క్రీడా ప్రతిభతో సాధించిన జాతీయ స్థాయి విజయం… ఈ రెండు అరుదైన సందర్భాలకు కంటోన్మెంట్ వేదికైంది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం తన కార్యాలయంలో దళితరత్న అవార్డు గ్రహీతలను, జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్ విజేతను ఘనంగా సత్కరించి అభినందించారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘దళితరత్న’ అవార్డుకు ఎంపికై రవీంద్రభారతిలో సన్మానం పొందిన పికెట్ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్, అడ్డగుట్ట ప్రాంత ప్రముఖుడు మల్లేష్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించిన ఎమ్మెల్యే, దళిత సమాజ అభ్యున్నతికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
దళితరత్న అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవమే కాదని, అది యావత్ దళిత సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, సామాజిక సమానత్వ స్థాపన, దళితుల సర్వతోముఖాభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా జార్ఖండ్‌లో నిర్వహించిన నేషనల్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి పతకం సాధించిన న్యూ బోయిన్‌పల్లికి చెందిన యువ క్రీడాకారుడు జైదీప్‌ను కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడారంగంలో అతడు సాధించిన విజయం కంటోన్మెంట్ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఇది విజయయాత్రలో తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాలు సాధించి కంటోన్మెంట్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతిభ ఉన్న యువతకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని జైదీప్‌కు భరోసా ఇచ్చారు.
#Sidhumaroju










