రోడ్లపై LED లైట్ల టార్చర్.. వాహనాలకు LED లైట్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న ప్రజలు. అయినా ఈ ప్రభుత్వానికి ఈ సమస్య కనపడటం లేదా? వినపడటం లేదా? రోడ్లపై తిరిగి వాహనాలకు చలాన్లు రాసే అధికారులకు, పోలీసులకు ఈ సమస్య కనపడటం లేదా? ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు సిరియస్ తీసుకోవడం లేదు? సోషల్ మీడియాలో జనం గగ్గోలు పెడుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు మౌనం వహిస్తుంది?
రాత్రి వేళ రోడ్లపై వాహనం నడపడం ఇప్పుడు చాలామందికి భయంగా మారుతోంది. కారణం ప్రమాదకరమైన స్పీడ్ కాదు.. గుంతలు కాదు.. ఎదురుగా వచ్చే వాహనాలపై అమర్చిన అధిక పవర్ LED లైట్లు. ఒకప్పుడు వాహనాల హెడ్‌లైట్లు రోడ్డును చూపించేందుకు ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు చాలామంది వాటిని స్టైల్, ఫ్యాషన్, రౌడీయిజం, షో ఆఫ్ కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బైకులు, కార్లు, జీపులు, ప్రైవేట్ బస్సులపై అమర్చుతున్న హై పవర్ వైట్ LED లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లపై నేరుగా పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఈ సమస్యపై వేలాది పోస్టులు, వీడియోలు, చర్చలు జరుగుతున్నాయి. “రాత్రి డ్రైవింగ్ చేయడం కష్టంగా మారింది”, “ఎదురుగా వచ్చే లైట్లు కళ్లను పూర్తిగా బ్లైండ్ చేస్తున్నాయి”, “హైవేలపై ప్రమాదాలు పెరుగుతున్నాయి” అంటూ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సమస్యపై ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ మాత్రం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. రోడ్లపై చిన్న చిన్న నిబంధనలకే చలాన్లు వేస్తున్న అధికారులు.. ఇలాంటి ప్రమాదకరమైన LED లైట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో అధిక పవర్ LED లైట్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. చాలామంది అసలు కంపెనీ ఫిట్టింగ్‌లను తీసేసి మరింత పవర్ ఉన్న లైట్లను అమర్చిస్తున్నారు. ముఖ్యంగా లో బీమ్, హై బీమ్ మధ్య తేడా కూడా తెలియకుండా రాత్రంతా హై బీమ్‌తోనే వాహనాలు నడిపే వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఎదురుగా వచ్చే డ్రైవర్లు కొన్ని క్షణాల పాటు పూర్తిగా విజిబిలిటీ కోల్పోతున్నారు. ఆ కొన్ని క్షణాలే ప్రమాదాలకు దారితీస్తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు చెబుతున్నారు.
హైవేలపై రాత్రి ప్రయాణించే వారు ఈ సమస్యను మరింత తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెండు చక్రాల వాహనదారులు ఎదురుగా వచ్చే LED కాంతిని తట్టుకోలేక రోడ్డు పక్కకు వెళ్లిపోవడం, బ్రేక్ వేయడం, బ్యాలెన్స్ కోల్పోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు డ్రైవర్లు అయితే “రాత్రి డ్రైవింగ్ కంటే పగలే ప్రయాణం సేఫ్” అని భావించే పరిస్థితి వచ్చింది. ఇది చిన్న సమస్య కాదు.. నేరుగా ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం.
ఇక మరో ముఖ్యమైన ప్రశ్న.. సోషల్ మీడియాలో ప్రజలు ఇంతగా చర్చిస్తున్న అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు పెద్ద ఎత్తున చర్చించడంలేదు? ప్రజల నిత్యజీవిత సమస్యలు, రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది కేవలం లైట్ సమస్య కాదు.. ప్రతి రోజు లక్షలాది మంది ఎదుర్కొంటున్న భద్రతా సమస్య.
ప్రపంచంలోని చాలా దేశాల్లో వాహన హెడ్‌లైట్లపై కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఆ అమలు సరిగా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాహన ఫిట్‌నెస్ పరీక్షల్లో కూడా ఈ అంశాన్ని కఠినంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం చలాన్లు వేయడం కాదు.. అవగాహన కార్యక్రమాలు కూడా అవసరం. డ్రైవర్లకు హై బీమ్ వినియోగం వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలియజేయాలి.
ప్రజలు ఇప్పుడు ఒక సాధారణ ప్రశ్న అడుగుతున్నారు. “ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న ఈ LED లైట్లపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది?” ఎందుకంటే రోడ్డు భద్రత అంటే కేవలం హెల్మెట్, సీట్ బెల్ట్ మాత్రమే కాదు.. రాత్రి వేళ సురక్షితంగా ప్రయాణించే హక్కు కూడా.










