🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా యువరాజ్ మార్మట్ మాట్లాడుతూ.
ఆసిఫాబాద్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకుంటూ, పట్టణంలో పెండింగ్లో ఉన్న వార్డుల అభివృద్ధి పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రైనేజీ వ్యవస్థలను, మౌలిక వసతులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










