కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత సెగ తీవ్రరూపం దాల్చగా, మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయి ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రస్తుతం డీజిల్ లభిస్తున్న ఏకైక ఇండియన్ ఆయిల్ (IndianOil) బంకు వద్దకే జిల్లా నలుమూలల నుండి వందలాది వాహనాలు ఒక్కసారిగా పోటెత్తాయి. ప్రస్తుతం వ్యవసాయ రబీ కోతలు,
సాగు పనులు పీక్ స్టేజ్‌లో ఉండటంతో ట్రాక్టర్ యజమానులు, రైతులు, ఆటో డ్రైవర్లు మరియు నిత్యావసర రవాణా వాహనదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడ్డారు. ఇంతటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎండలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా తమ కష్టాన్ని మరియు ఈ అస్తవ్యస్త పరిస్థితిని క్షేత్రస్థాయిలో పట్టించుకునేవారే కరువయ్యారని రైతులు. వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ, ఎలాంటి గొడవలు జరగకుండా వాహనదారులు స్వచ్ఛందంగా ఎంతో క్రమశిక్షణతో, ఓపికతో సంయమనం పాటిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంధనాన్ని నింపుకుంటున్నారు; కాగా, ఈ రద్దీ తాత్కాలికమేనని, సోషల్ మీడియా పుకార్లను నమ్మి కంగారు పడవద్దని, డిపోల నుండి రవాణా ఇబ్బందులను అధిగమించి సరఫరాను సాధారణ స్థితికి తెస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవ్వడం గమనార్హం.









