మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.
ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించి, భక్తులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా మల్కాజ్‌గిరి డివిజన్ శివపురి కాలనీలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి మినహాయించి చారిటబుల్ ట్రస్ట్ కింద పరిగణించాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని అందజేశారు.
ఓల్డ్ మల్కాజ్‌గిరిలోని శ్రీ విష్ణు దేవాలయానికి చెందిన స్థలంలో మున్నూరు కాపు భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మంత్రిని అభ్యర్థించారు.
వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత అంశాలపై సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, వెంకన్న, నవీన్ పాల్గొన్నారు.
అలాగే ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.
#Sidhumaroju
Alwal









