సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు.|

0
0

 

సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు

16-06-2026 Tue 

Andhra

AP is best destination for semiconductor manufacturing CM Chandrababu

30 రోజుల్లో ఏపీకి వచ్చి చూడాలంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యమిస్తున్నామన్న చంద్రబాబు

రాయలసీమలో త్వరలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు

సింగపూర్‌లోని సెమీకాన్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి

సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను స్వయంగా పరిశీలించేందుకు 30 రోజుల్లోగా ఏపీకి రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. సింగపూర్‌లో మంగళవారం జరిగిన ‘సెమీకాన్ ఎకోసిస్టమ్’ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.

 

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన దేశమని, అందులో ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన రాష్ట్రమని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే విధానాన్ని అనుసరిస్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

 

ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాయలసీమలో ఒక సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతుందని వెల్లడించారు. కేవలం సెమీకండక్టర్లే కాకుండా డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్‌ల తయారీ, ఆటోమొబైల్ రంగాలకు కూడా రాయలసీమ కేంద్రంగా మారే అవకాశాలున్నాయని వివరించారు. ఈ ప్రాంతాన్ని ఒక సమగ్ర పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

 

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్‌పీ, ఏఎస్ఎంపీటీ, ఒన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్సెండ్ ఫోటోమాస్క్, ఆక్వాటెక్ వంటి పలు అంతర్జాతీయ సెమీకండక్టర్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలపై వారు ఆసక్తి చూపినట్లు సమాచారం.