కూటమి విజయాలను గడపగడపకూ చేర్చాలి: మంత్రి నారా లోకేశ్|

0
0

 

కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్

17-06-2026 Wed

Andhra

Nara Lokesh says TDP cadre must take alliance achievements to every doorstep

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్

మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందేనన్న లోకేశ్

ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెబుదామని పిలుపు

సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టీకరణ

కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 45 రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, బుక్‌లెట్లను అందజేయాలన్నారు. జనసేన, బీజేపీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇది అధినేత చంద్రబాబు ఆదేశమని ఆయన పేర్కొన్నారు.

 

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గత కొద్ది కాలంగా చేపట్టిన భారీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని లోకేశ్ తెలిపారు. ‘తల్లికి వందనం’, ‘దీపం-2’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రూ. 4 వేల ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమం, ‘అన్నదాత సుఖీభవ’ వంటి అనేక పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించకపోతే మన కష్టం వృథా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014-19 మధ్య చేసిన అభివృద్ధిని సరైన రీతిలో ప్రచారం చేసుకోలేకపోవడం, ప్రత్యర్థుల విషప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం వల్లే గతంలో ఓటమి పాలయ్యామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ ప్రతి గడపకు వెళ్తారని వెల్లడించారు.

 

ఈ నెల 20వ తేదీ వరకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించి ప్రభుత్వ విజయాలపై ప్రజలను జాగృతం చేయాలని లోకేశ్ సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహించి, బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించామని తెలిపారు. ఏ ఒక్క ఓటు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం బీఎల్ఏలతో సంప్రదింపులు జరుపుతూ క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని, తీవ్రమైన సమస్యలుంటే పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఓటర్ వెరిఫికేషన్ సెల్‌ను సంప్రదించాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు