“మారేడుపల్లిలో ‘మీ సురక్ష’.. కాలనీవాసులకు ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ కీలక సూచనలు.|

0
11

సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

మారేడుపల్లి ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

ప్రజల రక్షణే ధ్యేయంగా కాలనీల గుండా సాగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇళ్లలో పనిచేసే సిబ్బంది మరియు డొమెస్టిక్ హెల్పర్స్ వివరాలను విధిగా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని (ఎన్యుమరేషన్) సూచించారు.

ఇది నివాసితుల ముందస్తు భద్రతకు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాల పట్ల కాలనీవాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్హెచ్ఓ పిలుపునిచ్చారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు ఎవరికీ పంచుకోవద్దని హెచ్చరించారు.

దీంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన ‘అరైవల్ అలైవ్’ (Arrival Alive) కార్యక్రమం ప్రాధాన్యతను కూడా వివరించారు.

ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు మాట్లాడటం, మితిమీరిన వేగంతో వెళ్లడం వంటివి ప్రాణాంతకమని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రజలకు కీలక జాగ్రత్తలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.

స్థానిక ప్రజలకు నిరంతరం అండగా ఉంటామని ఆయన భరోసా ఇవ్వడంతో ఈ ‘మీ సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

#Sidhumaroju