హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
21-06-2026 Sun
Andhra
CM Chandrababu and Lokesh perform Yoga for a Healthy Andhra Pradesh along with Baba Ramdev
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం
రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన
ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’ ప్రాజెక్ట్ అమలు
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల నిర్మాణం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగా చేయడం ఎన్నటికీ మరువలేని అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా సీఎం హర్షం వ్యక్తం చేశారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపు తెచ్చి, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మోదీ తన చొరవతో ప్రపంచానికి భారతదేశ శక్తులను చాటుతూ, దేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నారని కొనియాడారు. సాంకేతికత, ఆధ్యాత్మికతల కలయికతోనే సమాజ భవిష్యత్తు ముడిపడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.










