చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. “ఈ ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, అవసరమైన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది,” అని వెంకట్ అన్నారు.
“అనస్థీషియా డాక్టర్ లేకపోవడం వల్ల, గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు లేదా ఇతర నగరాలకు వెళ్లవలసి వస్తుంది, ఇది వారికి అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. “సురేష్ మాట్లాడుతూ, “చింతూరు మరియు పరిసర గ్రామాలకు ఈ ఆసుపత్రి కీలకమైనది. ఇక్కడ ప్రసవ సేవలు నిలిచిపోవడం వల్ల పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.” అని తెలిపారు. “ప్రభుత్వం వెంటనే స్పందిించి అనస్థీషియా డాక్టర్ ను నియమించాలని, లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాము,” అని వారు హెచ్చరించారు.
# Yadagiri










