ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది ఎంపీడీవోలకు డీడీవోలుగా ఉన్నత హోదా కల్పిస్తూ ప్రమోషన్ల ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి పైగా సిబ్బందికి ప్రమోషన్లు కల్పించడం విశేషం.
మరోవైపు, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలను అందుబాటులో ఉంచి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.










