రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఈ పోస్టులకు 1,89,316 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిరుద్యోగుల కోసం జూలైలో ‘నైపుణ్యం’ పోర్టల్‌ను ఆవిష్కరించి, నమోదైన వారికి ఆన్‌లైన్ స్కిల్ కార్డు జారీ చేయనున్నారు.
ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి మూడు నెలలకూ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటులో పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని పేర్కొన్నారు. అలాగే, ఓంక్యాప్ ద్వారా వచ్చే నెలలో 146 మంది యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రికి అధికారులు వివరించారు.










