రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు సుమారు 1,06,000 మందికి పైగా కొత్త అడ్మిషన్లు వచ్చాయని అధికారులు ఆయనకు వివరించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాల విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి సూచించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 175 ‘లీప్’ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ ట్యూటర్’ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. అలాగే, అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై కూడా లోకేష్ సమీక్షించారు.










