“ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు”
మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు.
శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ ఆసుదుల్లాను కలిసి సమస్య తీవ్రతను వివరించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా 2024లో వక్ఫ్ బోర్డు పొరపాటున మల్కాజ్‌గిరి పరిధిలోని సర్వే నంబర్లు 3, 103, 104, 105, 144 నుంచి 154 వరకు 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంతో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్‌టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్, కృష్ణా నగర్ తదితర ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే వివరించారు.
ఆంధ్రప్రదేశ్ గెజెట్ నం.35 పార్ట్-2 (27-08-1987), గెజెట్ నం.37 పార్ట్-2 (13-10-2001), అలాగే హైకోర్టు సి.ఆర్.పీ. నం.5057/2008 తీర్పు ప్రకారం సంబంధిత సర్వే నంబర్లు మల్కాజ్‌గిరికి కాకుండా ఉప్పల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందినవని మంత్రి, వక్ఫ్ బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.
కాలనీ సంక్షేమ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలుమార్లు వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓలను కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
దీనిపై మంత్రి మహ్మద్ అజారుద్దీన్, వక్ఫ్ బోర్డు సీఈఓ ఆసుదుల్లా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
మల్లాపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు పొరపాటున మల్కాజ్‌గిరి పరిధిలోని వక్ఫ్ జాబితాలో నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించామని, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలను అత్యవసరంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారని అన్నారు.
ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభావిత కాలనీవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మల్కాజ్‌గిరి ప్రజల హక్కులు, వారి ఆస్తుల రక్షణ కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
#Sidhumaroju
Alwal






