“కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి… నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండానే కిందకు వెళ్తున్న నీటిని ఎత్తిపోవచ్చని, ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన, తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ఉద్యమకారుడినని పేర్కొంటూ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని అన్నారు. “మేడిగడ్డలో నీళ్లు నింపమని అడగడం లేదు… నదిలోకి వెళ్తున్న నీటిని పంప్ చేయమని మాత్రమే కోరుతున్నాం” అని తెలిపారు.
హైదరాబాద్‌కు ఇప్పటికే 107 MGD నీటి కొరత ఉందని, రైతులు, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని, రాజకీయ విమర్శల కంటే ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే బాధ్యులను గుర్తించి అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిరుపయోగంగా మార్చొద్దని అన్నారు.
తాను ఎవరి స్క్రిప్ట్‌తో మాట్లాడే వ్యక్తిని కాదని, ప్రజల కోసం అవసరమైతే ఎంతవరకైనా పోరాడతానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
#Sidhumaroju










