బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతోందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మహబూబాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) తీవ్రంగా ఖండించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలు పెరిగి ఆదివాసీలు ఇబ్బందులు పడుతుంటే, ఒక ఆదివాసీ ఎమ్మెల్యే గిరిజనేతరుల పక్షాన నిలబడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వెంటనే ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
5వ షెడ్యూల్, పెసా, 1/70 చట్టాల పరిరక్షణ, జీవో నెం.3 అమలు, ఐటీడీఏ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ తదితర ఆదివాసీల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సువర్ణపాక వెంకటరత్నం, పూనేం సందీప్ కుమార్, ఈసం శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.










