🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుని స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చింతలమానేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన నికోడె గణేష్, శారద దంపతుల కుమారుడైన లోకేష్ అనే పద్నాలుగేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న ఒక పాత ఛార్జింగ్ లైట్ లోని బ్యాటరీని బయటకు తీసి, అది పనిచేయడం లేదనే కారణంతో తన పళ్లతో గట్టిగా కొరికాడు. బాలుడు పంటితో నొక్కిన మరుక్షణమే ఆ గట్టి ఒత్తిడికి ఛార్జింగ్ లైట్ బ్యాటరీ నోట్లోనే ఒక్కసారిగా పేలిపోయింది.ఈ భయంకరమైన ప్రమాదం వల్ల బాలుడి నోరు, గొంతు, ముఖ భాగాలు పూర్తిగా దెబ్బతిని తీవ్ర రక్తస్రావం కాగా, గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మార్గమధ్యంలోనే లోకేష్ ప్రాణాలు కోల్పోయాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇళ్లలో ఉండే ఎమర్జెన్సీ ఛార్జింగ్ లైట్లు, పాత ఫోన్ల బ్యాటరీల విషయంలో పిల్లలను అప్రమత్తం చేయాలని, బ్యాటరీలను నోట్లో పెట్టడం లేదా గట్టిగా నొక్కడం లాంటివి చేస్తే అవి క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉందని చింతలమానేపల్లి మండల పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు.










