తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను కమిషనర్ పదవి నుంచి తక్షణమే తొలగించి, ఆ స్థానంలో అర్హత కలిగిన మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (సీఎస్) న్యాయస్థానం ఆదేశించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, ఒక ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం ఏమాత్రం సరికాదని హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు కమిషనర్‌గా ఆయన ఇకపై కొనసాగకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.










