ఆసిఫాబాద్, జూలై 28: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్ (వర్షావాసం) కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. పూజ్య భంతే భరత్వాజ్ గారి పవిత్ర సమక్షంలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి బౌద్ధ ఉపాసి ఉపాసకులతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే ఆషాఢ పౌర్ణమి నుండి అశ్విని పౌర్ణమి వరకు మూడు నెలల పాటు బౌద్ధులు ఎంతో పవిత్రంగా ఈ వర్ష వాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, ఈ కాలంలో ప్రతిరోజు బౌద్ధ విహార్‌లో ఏదో ఒక పవిత్ర గ్రంథాన్ని పఠించడం జరుగుతుందని వివరించారు. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్‌లోని ఇసిక వనంలో పంచ వర్గీయ భిక్షువులకు తన తొలి ఉపదేశాన్ని బోధించారని, దీనినే ‘ధమ్మ చక్ర ప్రవర్తన్ దివస్’ అని అంటారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ అధ్యక్షులు మసాడే ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్, స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు యశ్వంత్, కోశాధికారి దుర్గం అనిల్, కౌన్సిలర్ వినోద్, జాడే కృష్ణజీ, సెంటర్ కమిటీ సభ్యులు దుర్గం పురుషోత్తం, కట్కర్ అజిత్, లోహాజీ తదితరులు పాల్గొన్నారు.










