మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న గ్రీల్స్ నుంచి పక్క డాబా పైకి దూకి ఆ డాబా నుంచి కిందికి వెళ్ళిపోయారు. సిసి ఫుటేజ్ ల ద్వారా చూసిన కళాశాల సిబ్బంది బస్టాండ్ ,రైల్వే స్టేషన్ల లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు సి.ఐ రఘుపతి రెడ్డి గురుకుల కళాశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పేరు , పిల్లల పేరు , ఊరు చెప్పేందుకు నిరాకరించారు.










