కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు|

0
1

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో ప్రజలందరూ పోలీసు నిబంధనలకు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద ఎత్తున గుమిగూడడం, సమావేశాలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడింది. జిల్లాలో ఎలాంటి ప్రజా బహిరంగ కార్యక్రమాలు, ధర్నాలు, సభలు లేదా ర్యాలీలు నిర్వహించాలన్నా డీఎస్పీ, ఎస్పీ లేదా ఉన్నతాధికారుల నుండి ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందడం తప్పనిసరి. అలాగే నిషిద్ధ ఆయుధాలు లేదా సమాజంలో నేరాలను, ఘర్షణలను ప్రేరేపించే ఎలాంటి వస్తువులను కలిగి ఉండరాదని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు లేదా సభలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారు 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని పోలీస్ శాఖ పేర్కొంది. జిల్లా ప్రశాంతతను కాపాడేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.