High tension in Sangareddy villagers attack on police station|

0
1

సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్‌ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి

 

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్థులు వట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌లోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

 

మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, బీరప్ప మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించే ముందు తమకు సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే పోలీసులు మృతదేహాన్ని కిందికి దించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా మృతదేహాన్ని ఎలా కిందకు దించారు?” అంటూ పోలీసులను నిలదీశారు.

 

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బీరప్ప మృతి ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.