వీబీ గ్రామ్ ఉద్యోగుల పెన్ డౌన్ నిరసన.. పే స్కేల్ అమలుకు డిమాండ్
20 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధిలో సేవలందిస్తున్న వీబీ గ్రామ్ (VB RAM G) ఉద్యోగులు, తమకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారీ 3, 4 నెలలు జీతాలు ఆలస్యం అవుతున్నాయని, ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు దినాల్లోనూ అంకితభావంతో పనిచేస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన ఆదేశాలను, ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క ఇచ్చిన హామీలను వారు ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఆగస్టు 15 నాటికి పే స్కేల్ అమలు చేసి, పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే వీరి ‘పెన్ డౌన్’ నిరసన ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వ స్పందన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.










