ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
రిలయన్స్ సంస్థ సహకారంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా, అంతర్జాతీయ స్థాయి ఃసెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ఃగా ఐఎస్ఏను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.మరికొన్ని అంతర్జాతీయ సంస్థలను కూడా భాగస్వాములుగా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఐఎస్ఏ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఆగస్టు నెలాఖరులోగా రిలయన్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరే అవకాశం ఉంది.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఐఎస్ఏను ఏర్పాటు చేయనున్నారు.
ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్.. డిజిటల్ అగ్రికల్చర్లో మాస్టర్స్
ఐఎస్ఏలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు సంబంధించిన ఆధునిక, సాంకేతిక అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.ఆయా విశ్వవిద్యాలయాల్లో వివిధ సంప్రదాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.అయితే వాటికి భిన్నంగా ఐఎస్ఏ ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ సుస్థిరత వంటి కీలక అంశాలపై ఐఎస్ఏలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్, డిజిటల్ అగ్రికల్చర్లో మాస్టర్స్ కోర్సులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వంటి ప్రపంచస్థాయి కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.










