🟠వాసవి మార్కెట్‌లో నిర్వహించిన లడ్డూ వేలం రూ.1.50 లక్షలకు
🟠మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు.. కోయ నృత్యాలతో హోరెత్తిన నందిగామ
▶️నందిగామ, సెప్టెంబర్ 27 bharat aawaz
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నందిగామ పట్టణం, మండల పరిధిలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నందిగామ పురవీధుల్లో సాగిన నిమజ్జన ఊరేగింపులతో పట్టణం సందడిగా మారింది.
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి
వాసవి మార్కెట్, మెయిన్ బజార్, అనాసాగరం, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనాలపై ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో పాటు కోలాటం, కోయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అర్ధరాత్రి వరకు ఊరేగింపులు
వాసవి మార్కెట్, మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన ఊరేగింపులు శనివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగాయి. యువత, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కృష్ణానదిలో నిమజ్జనం
నందిగామ పట్టణం, మండలంలోని పలు ప్రాంతాల నుంచి తరలించిన గణనాథుల విగ్రహాలను ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసి గంగమ్మ తల్లి ఒడికి చేర్చారు.
వాసవి మార్కెట్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో మహంకాళి చంద్రశేఖర్ యూత్ సభ్యులు రూ.1.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మెయిన్ బజార్‌లో ఏర్పాటు చేసిన గణపతి వద్ద లడ్డూను ముగ్గురు భక్తులు కలిసి రూ.35 వేలకు వేలంలో దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.










